గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు: టీడీపీ చీఫ్
గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు..అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు.
By Knakam Karthik
గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు: టీడీపీ చీఫ్
అమరావతి: గాడి తప్పిన ఎమ్మెల్యేల చర్యలను టీడీపీ చూస్తూ ఊరుకోదు..అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో పల్లా మీడియాతో మాట్లాడుతూ.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే అయినా ఇంకొకరైనా పార్టీ ఉపేక్షించదు..అని పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయం అని తెలిపారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిని సీఎం చంద్రబాబు నిత్యం పర్యవేక్షిస్తున్నారు, ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తప్పులు చేస్తే అది పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉంటే ఎందుకు ఉపేక్షించాలి. కొన్ని సందర్భాల్లో తప్పుడు ప్రచారాలు, ఫేక్ వీడియోలతో ఎమ్మెల్యేలపై కుట్ర జరుగుతుంది. ఇలాంటి వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది..అని పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది వైసీపీ దుష్ప్రచారమే. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పటికీ ప్రయివేటీకరణ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కేంద్ర నిధుల ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకున్నారు. వైసీపీకి అనుబంధంగా ఉన్న కొన్ని కార్మిక సంఘాలు తమ పబ్బం గడుపుకునేందుకు దుష్ప్రచారంలో భాగమవుతున్నారు. ప్రయివేటీకరణ జరుగుతుంటే కొనటానికి వచ్చే పెట్టుబడిదారు పేరు కూడా వైసీపీ వాళ్లు చెప్పాలి. ప్లాంట్ లాభాల్లో నడుస్తుందనేది ఓర్వలేక అక్కసుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నిర్వాసితులకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతాం. ఓవైపు స్టీల్ ప్లాంట్ పై, మరోవైపు అమరావతి పై ప్రజల్లో వైసీపీ సృష్టిస్తున్న అపోహల్ని ధీటుగా తిప్పికొడతాం. తప్పుడు ప్రచారాలు చేసేవారిని కఠినంగా శిక్షిస్తాం..అని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.