జూన్ నుంచి అందుబాటులోకి పలాస కిడ్నీ రీసెర్చి సెంటర్
Palasa Kidney Research Center will be available from June. జగనన్న అవిశ్రాంత కృషి ఫలిస్తోందని, వైద్య ఆరోగ్య శాఖలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన మహా యజ్ఞం తాలూ
By Medi Samrat Published on 21 April 2023 2:45 PM GMTజగనన్న అవిశ్రాంత కృషి ఫలిస్తోందని, వైద్య ఆరోగ్య శాఖలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన మహా యజ్ఞం తాలూకా ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎంఐడీసీ) అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ఐదు మెడికల్ కళాశాలల పురోగతి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య వసతులపై ఈ సందర్భంగా చర్చించారు. మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి తరగుతులు ప్రారంభమయ్యేలా రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలను ప్రాధాన్యతగా తీసుకుని వసతులు సమకూర్చామని చెప్పారు. భవనాల నిర్మాణం, పరికరాల కొనుగోలు, సిబ్బంది నియామకం, ఇతర వసతులన్నీ కల్పించామని వివరించారు. తాజాగా ఎన్ ఎంసీ ఈ కళాశాలల్లో తనిఖీలు కూడా చేపట్టిందని, నివేదికలు చాలా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పిటికే విజయనగరంలో నూతన కళాశాలలో ఈ ఏడాది నుంచే తరగతుల ప్రారంభానికి ఎన్ ఎంసీ అనుమతులు ఇచ్చిందని, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్టణం, నంద్యాల పట్టణాల్లో ప్రభుత్వం నిర్మించిన నూతన మెడికల్ కళాశాలలకు కూడా అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్ ఎంసీ అధికారులు వీటిపై సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. వీటికి కూడా అనుమతులు రాగానే.. రాష్ట్ర చరిత్రలో తొలి సారి ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమవుతాయని, ఇది జగనన్న ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కళాశాలల్లో తొలి ఏడాది తరగుతులు పూర్తయ్యాక మరోసారి ఎన్ ఎంసీ తనిఖీలు ఉంటాయని, వాటికి కూడా ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని సూచించారు. కావాల్సిన వసతుల విషయంలో రాజీ ఉండకూదన్నారు. వచ్చే ఏడాది మరో మూడు ప్రభుత్వ కళాశాలలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని, ఆదోని, పులివెందుల, పాడేరు పట్టణాల్లో వీటిని సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఈ పనుల పరోగతిపై సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రభుత్వ ప్రాధాన్య మెడికల్ కళాశాలల నిర్మాణం, వసతుల కల్పన విషయంలో అధికారులు బాగా పనిచేశారని అభినందనలు తెలిపారు.
రెండు నెలల్లో మరింతగా..
వచ్చే రెండు, మూడు నెలలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగానికి ఎంతో కీలకమని మంత్రి తెలిపారు. పిడుగురాళ్లలో మెడికల్ కళాశాల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్పారు. ఇక్కడ తొలుత 250 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. తుది దశలో ఈ బెడ్ల సంఖ్య 600 గా మారుతుందని చెప్పారు. ఈ ఆస్పత్రిని మరో రెండు నెలల్లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని వచ్చే జూన్ లో ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. కర్నూలులో నిర్మాణంలో ఉన్న స్టేట్ క్యాన్సర్ ఆస్పత్రి పనులు తుది దశకు చేరాయని, ఈ ఆస్పత్రిని కూడా రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. కడపలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే దీన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం లో నిర్మాణంలో ఉన్న స్టేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లను కూడా మరో రెండు నెలల్లో ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. నూతన వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. కాబట్టే పేదల కోసం వైద్య ఆరోగ్య రంగంలో ఇన్ని మార్పులు తీసుకురాగలుగుతున్నారని తెలిపారు. ఆయన చేపట్టిన మహా యజ్ఞం ఫలాలు ప్రజలకు చేరవయ్యాయని చెప్పారు.
పీజీ సీట్లలో రికార్డు
వైద్య ఆరోగ్య రంగంలో జగనన్న తీసుకొచ్చిన గొప్ప సంస్కరణల ఫలితంగా రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా పీజీ సీట్ల సంఖ్యను పెంచుకోగలిగామని మంత్రి తెలిపారు. వైద్య కళాశాలల్లో మెరుగుపరిచిన వసతులు, చేపట్టిన నియామకాల ఫలితంగా ఏకంగా 65 శాతం సీట్లను ఈ నాలుగేళ్ల కాలంలోనే పెంచుకోగలిగామని చెప్పారు. ఇది దేశంలోనే ఒక రికార్డు అని తెలిపారు. 2019కు ముందు మన రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కేవలం 966 పీజీ సీట్లు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 1593కు చేరిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఏకంగా 627 సీట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఎన్ ఎంసీ తుది దశ తనిఖీలన్నీ పూర్తయ్యేలోగా మరో 50 నుంచి 100 సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు మంచి మనసుతో ఏదైనా చేస్తే.. ఫలితాలు కూడా ఇలానే గొప్ప గా ఉంటాయని చెప్పడానికి వైద్య ఆరోగ్యశాఖే నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఎంఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి, ఆ విభాగానికి చెందిన ఇతర అధికారులు, అకడమిక్ డీఎంఈ సత్యవరప్రసాద్, డీఎంఈ కార్యాలయ సిబ్బంది దితరులు పాల్గొన్నారు.