గుడ్‌న్యూస్.. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు పారదర్శకంగా బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
By - Medi Samrat |
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు పారదర్శకంగా బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కానూరులోని సివిల్ సప్లైస్ భవన్ లో గురువారం పాత్రికేయుల సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. నూతన సాంకేతికతతో క్యూర్ కోడ్ కలిగిన స్మార్ట్ రైస్ కార్డులను కొన్ని చోట్ల 85 శాతం, మరికొన్ని చోట్ల 95 శాతం షెడ్యూల్ లో పేర్కొన్న ఆయా జిల్లాల్లో రేషన్ షాపులు వద్ద, గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించడం జరిగిందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వృద్దులకు ఇళ్లకు వెళ్లి ఇస్తున్నామన్నారు. నాలుగు దశల్లో 1 కోటీ 45 లక్షల స్మార్డ్ కార్డుల పంపిణీ ఆయా రేషన్ కార్డుల దుకాణాల వద్ద, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీ చేస్తున్నామన్నారు. రెండు విడతలుగా ప్రజలకు ఈకెవైసీ ఆధారంగా ఈ కార్డులు అందిస్తున్నామన్నారు. దేశంలోనే 96.5 శాతం ఈకైవైసి చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. ఈనెల 15 నుంచి అన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందన్నారు.
స్మార్ట్ కార్డుల్లో కొన్ని చోట్ల తప్పులు ఉన్నట్లు మా దృష్టికి వచ్చాయని, అయితే ఈకెవైసీ, ఆధార్ ఆధారంగా మేము కార్డులను ముద్రించామని, పేర్ల మార్పు, చిరునామాల మార్పులు చేసుకోకపోవడం వల్లే ఈ తప్పులు జరిగినట్లు సమాచారం ఉందన్నారు. పోర్టబులిటీ ఉన్నందున సరుకులు ఏ రేషన్ షాపు నుంచైనా తీసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇప్పుడు కార్డులు ప్రజలకు అందిస్తున్నారన్నారు. రేషన్ కార్డులో మార్పులు చేయాల్సి వస్తే.. సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందన్నారు. అక్టోబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. వచ్చే వారం నుంచి మన మిత్ర యాప్ లో కూడా కార్డులో మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
రేషన్ షాపులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే ఆయా షాపు వద్ద ఏర్పాటు చేసిన క్యూ ఆర్ కోడ్ ను మీ ఫోన్ లో స్కాన్ చేసి, అక్కడ మీకు కలిగిన ఇబ్బందిని తెలియచేయవచ్చన్నారు. నవంబర్ 1 వ తేదీ నుంచి నామినల్ ఫీజు రూ. 35 చెల్లిస్తే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పోస్టల్ శాఖ ద్వారా రిజిస్టర్ పోస్టులోఇంటికి పంపిస్తున్నామన్నారు. అక్టోబర్ 31 వరకు మాత్రం ఉచితంగా నిర్ధేశించిన ప్రాంతాల్లో ఈ స్మార్ట్ కార్డులు అందిస్తామన్నారు. మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుందని కాని ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే... మళ్లీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుందన్నారు. 890 కార్డులు రద్దుకు సంబంధించి మాకు దరఖాస్తులు వచ్చాయని, స్థానిక తహశీల్దారు దీనిపై పరిశీలన చేసిన తర్వాత అర్హత ఉంటే మళ్లీ కార్డులు పునరుద్దరిస్తామన్నారు. రాష్ట్రంలో 4.42 కోట్ల మందికి ప్రతి నెలా రేషన్ ను సరఫరా చేస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ మూడో విడతలో ఉన్నామన్నారు. 97.59 లక్షల మందికి తొలి విడతలో దీపం పధకం కింద గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. రైస్ కార్డు ఉన్న అందరినీ అనుసంధానం చేసి.. దీపం పధకం కింద ఉచితంగా గ్యాస్ అందించామన్నారు. గిరిజన ప్రాంతాల్లో 5 కేజీల సిలిండర్ నుంచి 14.5 కేజీల సిలిండర్లను అందిస్తున్నామన్నారు. మొదటి, రెండో విడతకు మనకు కొత్తగా రెండు లక్షల గ్యాస్ కనెక్షన్ లు పెరిగాయన్నారు. స్మార్ట్ కార్డులో ఉన్న క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే వారి వివరాలు వస్తాయన్నారు. వైట్ కార్డు ఉన్న అందరికీ ప్రభుత్వం అమలు చేసే పధకాలు స్మార్ట్ రేషన్ కార్డుకు కూడా వర్తిస్తాయన్నారు. సామాన్యుడిని ఆదుకునే విధంగా నిజాయితీతో పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేసిన విధంగా పనిచేస్తున్నామన్నారు.