కిడ్నీకి రూ.7 కోట్లు ఆఫర్‌ చేసిన మోసగాళ్లు.. రూ.16 లక్షలు పొగొట్టుకున్న విద్యార్థిని

Offered Rs 7 Crore For Her Kidney Student Ends Up Losing Rs 16 Lakhs To Cyber Criminals. గుంటూరు: ఆన్‌లైన్ ప్రకటన చూసి ఓ విద్యార్థిని రూ.16.40 లక్షలు పొగొట్టుకుంది.

By అంజి  Published on  14 Dec 2022 12:58 PM IST
కిడ్నీకి రూ.7 కోట్లు ఆఫర్‌ చేసిన మోసగాళ్లు.. రూ.16 లక్షలు పొగొట్టుకున్న విద్యార్థిని

గుంటూరు: ఆన్‌లైన్ ప్రకటన చూసి ఓ విద్యార్థిని రూ.16.40 లక్షలు పొగొట్టుకుంది. ఆన్‌లైన్‌లో 'కిడ్నీ దానం చేస్తే రూ.7 కోట్లు ఇస్తాం' అన్న ప్రకటనను చూసి నర్సింగ్‌ విద్యార్థిని నమ్మింది. ఆ తర్వాత సైబర్‌ నేరగాళ్లు చెప్పినట్లు చేసింది. రూ.7 కోట్లు వస్తాయి అని నమ్మి.. వాయిదాల పద్దతిలో సైబర్ నేరగాళ్లకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.16.40 లక్షలు ఇచ్చింది. చివరకు అసలు నిజం తెలుసుకుని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి విత్‌డ్రా చేసిన డబ్బును తిరిగి పొందేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా ఎస్పీ కె ఆరీఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో జరిగిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో బాలిక, ఆమె తండ్రి గుంటూరు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలానికి చెందిన బాలిక హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఆమె తండ్రి ఇంటి నిర్మాణం కోసం రూ.20 లక్షలు బ్యాంకులో ఉంచాడు. తండ్రికి తెలియకుండా ఆమె రూ.2 లక్షలు ఫోన్‌పే ద్వారా తీసుకుంది. అయితే రూ.2 లక్షలు తీసుకున్న విషయం తెలిస్తే తండ్రి మందలిస్తాడనే భయంతో తానే డబ్బు సంపాదించి తండ్రికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు ఈ ఏడాది ఫిబ్రవరి 26న యూట్యూబ్‌లో ఎవరైనా కిడ్నీ దానం చేస్తే రూ.7 కోట్లు ఇస్తామని ప్రకటన వచ్చింది. ఆ యాడ్‌ లింక్‌పై క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో, వాట్సాప్ ద్వారా ఇద్దరు వ్యక్తులతో మాట్లాడింది. శస్త్రచికిత్సకు ముందు రూ.3.50 కోట్లు, శస్త్రచికిత్స తర్వాత రూ.3.50 కోట్లు ఇస్తామని యువతికి మోసగాళ్లు చెప్పారు. అయితే వారు ఆమె నుంచి పన్నులు, పోలీసు వెరిఫికేషన్ ఖర్చుల కోసం రూ. 16 లక్షలు వసూలు చేశారు.

ఆమె తండ్రి పేరుతో చెన్నైలోని ఓ కార్పొరేట్ బ్యాంకులో ఖాతా తెరిచి రూ.3.50 కోట్లు డిపాజిట్ చేశామని నమ్మబలికారు. ఆ తర్వాత బాలిక ఆన్‌లైన్‌ బదిలీ ద్వారా వాయిదాల పద్ధతిలో రూ.16.40 లక్షలు చెల్లించింది. అయితే, ఆమె మనసు మార్చుకుని, ఏదో తప్పు జరిగిందని భావించి తన డబ్బును తిరిగి ఇవ్వాలని కోరింది. నగదు తీసుకునేందుకు ఢిల్లీకి రావాలని మోసగాళ్లు ఆమెకు సూచించారు. అక్టోబర్ 8న విమానంలో ఢిల్లీ వెళ్లిన ఆమె చిరునామా నకిలీదని తేలడంతో తిరిగి వచ్చారు. ఇదిలా ఉండగా నవంబర్‌లో రూ.16 లక్షల నగదు విత్‌డ్రా అయిన విషయాన్ని బాధితురాలి తండ్రి తెలుసుకుని అదే విషయాన్ని కుమార్తెను అడిగాడు.

జరిగిన మోసం తండ్రికి తెలిస్తే తిడతారనే భయంతో హైదరాబాద్‌లోని హాస్టల్ నుంచి పారిపోయి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని స్నేహితురాలి ఇంట్లో తలదాచుకుంది. తన కుమార్తె అదృశ్యంపై జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లి తండ్రికి అప్పగించారు. ఆ తర్వాత జరిగిన మొత్తం విషయాన్ని బాలిక తన తండ్రికి చెప్పింది. దీంతో వారు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ వేగవంతం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్‌కు వినతి పత్రం సమర్పించారు.

Next Story