ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబుల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి తరపున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు, పవన్ కోసం పిఠాపురం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన టీడీపీ నేత వర్మకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మిగిలిన మూడు సీట్లను వివిధ సామాజికవర్గాలకు ఇచ్చే అవకాశం ఉంది. సంఖ్యాబలం లేని వైసీపీకి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కే అవకాశం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ వనితా రాణిని ఈసీ నియమించింది. మరో ఇద్దరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించింది.