Andhrapradesh: ప్రైవేట్‌ మద్యం షాపులకు నోటిఫికేషన్‌.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త లిక్కర్‌ పాలసీని ఖరారు చేసింది. ఈ పాలసీ అక్టోబర్‌ 12 నుంచి 2026 సెప్టెంబర్‌ 30 వరకూ అమల్లో ఉంటుంది.

By అంజి  Published on  1 Oct 2024 7:07 AM IST
private liquor shops, Andhrapradesh, applications, APnews

Andhrapradesh: ప్రైవేట్‌ మద్యం షాపులకు నోటిఫికేషన్‌.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త లిక్కర్‌ పాలసీని ఖరారు చేసింది. ఈ పాలసీ అక్టోబర్‌ 12 నుంచి 2026 సెప్టెంబర్‌ 30 వరకూ అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం షాపులకు లైసెన్సుల జారీకి సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. మంగళవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11న లాటరీ జరుగుతుంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా అప్లికేషన్‌ పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్‌లు అయినా పెట్టుకోవచ్చు.

ఒక్కో దానికి రూ.2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ డబ్బులు కట్టాలి. బ్యాంకు చలానా లేదా డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీడీ తీసుకుని ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి, లైసెన్సులు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 11వ తేదీన జరగనుంది. 12వ తేదీన లైసెన్సుదారులు కొత్త మద్యం షాపులు ప్రారంభించుకోవచ్చు.

కొత్త విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాలే యధాతథంగా కొనసాగుతాయి. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఐదు వేరు వేరు ఉత్తర్వులు ఇచ్చారు. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.50 లక్షలు. 10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,001 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్‌ ఫీజు 65 లక్షలు ఉంది. 5 లక్షలు దాటిన నగరాల్లో గరిష్ఠ ఫీజు రూ.85 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులను లైసెన్సీలు ఆరు విడతలుగా చెల్లించవచ్చు.

రూ.99కే క్వార్టర్‌ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు. నోటిఫై చేసిన 3,396 మద్యం షాపులతో అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటికి విడిగా విధివిధానాలు ఉంటాయి.

Next Story