Andhra Pradesh: గుడ్‌న్యూస్.. మరో నాలుగు రోజుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
అమరావతి: త్వరలోనే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాల భర్తీ చేసేందుకు సీఎం జగన్ సర్కార్ సిద్ధమైంది.
By అంజి Published on 13 Oct 2023 2:04 AM GMTAndhra Pradesh: గుడ్‌న్యూస్.. మరో నాలుగు రోజుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
అమరావతి: త్వరలోనే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఉద్యోగాల భర్తీ చేసేందుకు సీఎం జగన్ సర్కార్ సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. మొత్తం 3,200 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. మొదట టెట్, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నట్టు బొత్స సత్యనారాయణ ట్వీట్ చేశారు. విశ్వ విద్యాలయాల్లో 18 ఏళ్లుగా పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ జరగలేదన్న బొత్స.. యూనివర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఖాళీగా ఉన్న 3,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతామని చెప్పారు. పాఠశాలల్లో ఖాళీలన్నింటీని గుర్తించామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైజూస్‌తో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుందని బొత్స తెలిపారు. కంటెంట్ మొత్తం బైజూస్ ఫ్రీగానే ఇస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆ సంస్థకు చెల్లించట్లేదని చెప్పారు. పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం టోఫెల్‌ని తీసుకొచ్చామన్నారు. విద్యాశాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయన్నారు. సీఎం జగన్ తొలి ప్రాధాన్యత అయిన విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి బొత్స అన్నారు.