ఏపీ నిరుద్యోగులకు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో 20 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే తెలిపారు. డిసెంబర్ 2023 నాటికి 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు.
ఈ పోస్టుల భర్తీని త్వరలో చేపడతామన్నారు. కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని ముందుకెళ్తామన్నారు.
ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయిన 95,208 మంది నిరుద్యోగులు తదుపరి ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు. రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ అంశంపై సమీక్షలు చేపట్టారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది.