ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజలు మనుగడ కోసం పోరాడుతున్నారని, విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే ఉత్తర కోస్తాంధ్ర అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రాంతాల మధ్య అసమానతలు ఉండకూడదన్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే మిగిలిన ప్రాంతం వెనుకబడిపోతుందని, అందుకే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర అనేక రంగాల్లో వెనుకబడి ఉందని చెప్పిన మంత్రి, రాజధానిపై కమిటీ సిఫార్సులను గత ప్రభుత్వం పక్కన పెట్టిందని, దీనిపై చంద్రబాబు ఇంకా సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. అమరావతి రాజధాని ప్రతిపాదన కొన్ని వర్గాల అభివృద్ధి కోసమేనని, గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. అమరావతి రాజధానికి సెంటిమెంట్ ఉందన్న వ్యాఖ్యలపై ధర్మాన స్పందిస్తూ సెంటిమెంట్ ఉంటే మంగళగిరిలో లోకేష్ ఎలా ఓడిపోయారని ప్రశ్నించారు. టీడీపీకి ప్రజలు అండగా ఉన్నా ఉత్తర కోస్తా ఆంధ్రాకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు.