ఏపీ మంత్రి లోకేశ్‌తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ భేటీ
ఏపీ మంత్రి లోకేశ్‌తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ సమావేశం అయ్యారు.
By Knakam Karthik
ఏపీ మంత్రి లోకేశ్‌తో నోబెల్ బహుమతి గ్రహీత మైఖేల్ క్రెమర్ భేటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభిస్తోందని నోబెల్ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త, యూనివర్సిటీ ఆఫ్ చికాగో ప్రొఫెసర్ మైఖేల్ క్రెమర్ ప్రశంసించారు. ఉండవల్లి నివాసంలో బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో ఆయన సమావేశమయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బృందం నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్‌టెక్ సామర్థ్యం పెరిగిందని వివరించారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ( PAL) కార్యక్రమాన్ని ఉపయోగించిన విద్యార్థులు కేవలం 17 నెలల్లోనే PAL లేని పాఠశాలల విద్యార్థుల కంటే 2.25 రెట్లు అభ్యసన పురోగతిని సాధించారని వివరించారు.
అన్ని తరగతుల విద్యార్థుల్లో, ముఖ్యంగా చిన్న తరగతుల విద్యార్థులలో ఈ పురోగతి స్పష్టంగా కనిపించిందని గణాంకాలతో సహా తెలియజేశారు. PAL వినియోగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమస్థానంలో ఉండి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇటీవల గుజరాత్ సమగ్రశిక్ష బృందం ఏపీలో పర్యటించి, PAL అమలు తీరు సత్ఫలితాలు ఇస్తోందని, తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని చెప్పిన అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2018లో 60 పాఠశాలల్లో ప్రారంభమైన PAL కార్యక్రమం, ప్రస్తుతం 26 జిల్లాల్లోని 1,224 పాఠశాలలకు విస్తరించి, 3.25 లక్షల మందికి పైగా విద్యార్థులకు చేరువైందన్నారు. PAL కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ (CSF) సహకారంతో అమలవుతుండగా, కన్వే జీనియస్ టెక్నాలజీ సాంకేతిక సహకారం అందిస్తుందని తెలిపారు.