గుడ్లు, మాంసం నిరభ్యంతరంగా తినవచ్చు : మంత్రి అచ్చెన్నాయుడు
బర్డ్ ఫ్లూ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుచున్నదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
By Medi Samrat Published on 13 Feb 2025 4:54 PM IST
బర్డ్ ఫ్లూ పై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరుగుచున్నదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సమస్య పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు బోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆప్ హైసెక్యురిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారన్నారు. కేంద్ర నుండి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్థక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారని ఆయన తెలిపారు.
బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎటువంటి భయం లేకుండా బాగా ఉడికించిన గుడ్లను, మాంసాన్ని నిరభ్యంతరంగా తినవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పలు మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలు, సమాచారం వల్ల ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రజలు బయాందోళనలకు గురయ్యేలా బర్డ్ ప్లూ పై తప్పుడు వార్తలు, సమాచారాన్ని వ్యాప్తి చేసేవారి పై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
బర్డ్ ఫ్లూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా బాదంపూడి, పశ్చిమగోదావరి జిల్లా వేల్పూరు, కానూరు మరియు కృష్ణా జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లోని ఐదు ఫ్రౌల్ట్రీల్లో ఈ వ్యాది సోకినట్లుగా గుర్తించి ఆయా ప్రాంతాలను బయో సెక్యురిటీ జోన్లుగా ప్రకటించి, అధికారులను, సిబ్బందిని ఆయా ప్రాంతాలకు పంపించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ బర్డ్ ప్లూ వ్యాప్తి నియంత్ర్రణకై కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలోమీటరు పరిధిలో రాకపోకలను, దాణా రవాణాను నియంత్రిస్తున్నామని, ఒక ఫౌల్ట్రీ కూడా లేకుండా చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకటి నుండి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ముందస్తు జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నామని.. ఈ పరిధికి బయటనున్న ప్రాంతాల్లో ఎటు వంటి ప్రభావం ఉండదని మంత్రి తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఈ వ్యాధి సోకిన దాఖలాలు ఇప్పటి వరకూ ఏమీ కనిపించలేదని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, పశు సంవర్థక శాఖ, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు.
రాష్ట్ర పశు సంవర్థక శాఖ సంచాలకులు డా.టి.దామోదర నాయుడు మాట్లాడుతూ.. సైబీరియన్ వలస పక్షులు రెట్టల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ బర్డ్ ప్లూ వ్యాప్తి చెందిందన్నారు. ఆయా ప్రాంతాలను రెడ్ జోన్ లుగా ప్రకటించి వ్యాధి నియంత్రణ చర్యలను తీసుకోవడం జరుగుచున్నదన్నారు. ఇప్పటి వరకూ 14 వేల కోళ్లను కాల్చేయడంతో పాటు 340 గ్రడ్లను నాశనం చేయడం జరిగిందన్నారు. మరో రెండు మూడు ఫౌల్ట్రీలో 1.40 లక్షల కోళ్ల వరకూ ఉన్నాయని, వాటిని కూడా కాల్చేసే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.