ఏపీలో జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు రాత్రి క‌ర్ఫ్యూ.. మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌

Night Curfew Guidelines Released by AP GOVT.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండ‌డంతో ప్ర‌భుత్వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2022 8:47 AM GMT
ఏపీలో జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు రాత్రి క‌ర్ఫ్యూ.. మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా వ్యాప్తి నివారణ చర్యలు కఠిన తరం చేసింది. నిన్న‌టి నుంచి రాష్ట్రంలో రాత్రి క‌ర్ఫ్యూని విధించిన సంగ‌తి తెలిసిందే. కాగా.. నేడు రాత్రి క‌ర్ఫ్యూకి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది. రాత్రి 11 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపింది. ఈ నెల‌(జ‌న‌వ‌రి )31 వ‌ర‌కు రాత్రి క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంద‌ని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపును ఇచ్చారు.

ఆస్పత్రులు, ఫార్మసీ దుకాణాలు, పత్రిక, ప్రసార మాధ్యమాలు, టెలీ కమ్యూనికేషన్లు, ఐటీ సేవలు, విద్యుత్ సేవలు, పెట్రోల్ స్టేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు రాత్రి క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు. సంక్రాంతి పండుగ‌ను దృష్టిలో ఉంచుకుని అంత‌రాష్ట్ర ర‌వాణాకు అనుమ‌తి ఇచ్చారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించక‌పోతే రూ.100 జ‌రిమానా విధించ‌నున్నారు.

ప‌బ్లిక్ గేద‌రింగ్స్‌కు ప‌రిమిత సంఖ్య‌తో కూడిన అనుమ‌తికి నిర్ణ‌యం తీసుకుంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో 200 మంది, ఇండోర్ గేద‌రింగ్స్‌కు 100 మందికి మాత్ర‌మే పర్మిష‌న్ ఇచ్చింది. ఇక వాణిజ్య దుకాణాలు, మాల్స్ తదితర వాటిల్లో కొవిడ్ మార్గదర్శకాలు పాటించక పోతే రూ.10 వేల నుంచి 25 వేల వరకు జరిమానా విధించ‌నున్నారు. సినిమా హాళ్లలో 50 శాతం ఆక్యుపెన్సీకే అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ సహా ప్రజా రవాణా వాహనాల్లో సిబ్బంది, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆ ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.





Next Story