ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏపీ ప్రభుత్వానికి.. ఎన్జీటీ రూ.120 కోట్ల భారీ జరిమానాను విధించింది. చింతలపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టారని, ఇందుకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ జరిమానా వేసింది. చింతలపూడికి రూ.73.6 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, పురుషోత్తపట్నంకు రూ.24.56 కోట్లు జరిమానా విధించింది. ఈ ఎత్తిపోతల పథకాల్లో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ సామాజికవేత్త పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్‌లు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. విధించిన జరిమానాను 3 నెలల్లోగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది.
జరిమానా చెల్లించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలిచ్చింది. ఇక జరిమానా నిధుల వినియోగంపై ఏపీపీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీ నియమించాలని పేర్కొంది. అయితే జరిమానా విధించిన మూడు ఎత్తిపోతల పథకాలు కూడా పోలవరంలో భాగమని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రాజెక్టులు పోలవరం పూర్తి కాకముందే కాలువల ద్వారా నీటిని పంపించేందుకు నిర్మించారు. అయితే ఇవి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా నిర్మించారని గతంలో ఎన్జీటీలో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వం కూడా.. ఇవి పోలవరం ప్రాజెక్టులో భాగం కావని చెప్పింది. అయితే ఈ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వం కట్టినవే.