టాలీవుడ్‌కు శుభ‌వార్త.. ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు.. జీవో జారీ

New Ticket rates G.O Released in AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 March 2022 2:43 PM GMT
టాలీవుడ్‌కు శుభ‌వార్త.. ఏపీలో సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపు.. జీవో జారీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సినిమా టికెట్ రేట్ల‌ను నిర్ధారిస్తూ జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏లుగా సినిమా టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ధారించింది. థియేట‌ర్ల‌లో క‌నీస టికెట్ ధ‌ర రూ.20 కాగా.. గ‌రిష్ట ధ‌ర రూ.250గా ఉంది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‏లను నాలుగు కేటగిరీలుగా విభజించింది. చిన్న సినిమాల‌కు ఐదో షో వేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ప్రతి థియేటర్‌లో 25 శాతం సీట్లు నాన్ ప్రీమియంకు కేటాయించాలని చెప్పింది. హీరో, డైరెక్ట‌ర్ పారితోషికం కాకుండా సినిమా బ‌డ్జెట్ రూ.100 కోట్లు దాటిన సినిమాల‌కు రేట్లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించింది. క‌నీసం 10 రోజులు రేట్లు పెంచుకునే అవ‌కాశం ఇచ్చింది.

కొత్త జీవో ప్రకారం.. సినిమా టికెట్ల ధరలు కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100గా కాగా.. నాన్ ఏసీలో టికెట్ల ధరలు రూ.40, రూ.60గా నిర్ణయించింది. కార్పొరేషన్ స్పెషల్ థియేటర్లలో రూ. 100, రూ.125, కార్పొరేషన్ మల్టీప్లెక్స్‌ల్లో రూ.150, రూ.250 ఉంది. మున్సిపాలిటీల్లో నాన్ ఏసీలో రూ.30, రూ.50 గా టికెట్ ధ‌ర‌లు ఉండ‌నున్నాయి.

మున్సిపాలిటీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.80, రూ. 100గా, మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్ ల్లో రూ.125, రూ.250గా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70, నాన్ ఏసీలో రూ.20 నుంచి రూ. 40 ధ‌ర‌లు ఉండనున్నాయి. నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.70, రూ.90గా ఉంది. నగర పంచాయతీల్లో మల్టిపెక్స్ ల్లో టికెట్ ధర రూ.100 నుంచి రూ. 250 వరకు ఉండ‌నున్నాయి.

ఇక‌.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయంలో జీవో జారీ కావడంతో సినీ పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది. టికెట్ ధ‌ర‌ల పెంపు జీవో రావ‌డంతో 'రాధేశ్యామ్' నిర్మాత‌లు ఆనందం వ్య‌క్తం చేశారు. మార్చి 11న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story