ఏపీలో మరో కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం కసరత్తును ప్రారంభించాయి. ఈ క్రమంలో కొత్తగా పలు రాజకీయ పార్టీలు పురుడు పోసుకుంటున్నాయి. తెలుగు చలనచిత్ర గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన జొన్నవిత్తుల తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. అయితే ఆయన భాషా ప్రాతిపదికన ఈ రాజకీయ పార్టీ ప్రకటించారు. తెలుగు భాష అజెండాగా జొన్నవిత్తుల.. జై తెలుగు పార్టీగా నామకరణం చేసినట్లు తెలిపారు. త్వరలో ఈ పార్టీని ప్రారంభించబోతున్నట్లు జొన్నవిత్తుల ప్రకటించారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీని ప్రారంభించామని.. రాష్ట్రంలో నాయకులు, ప్రజలను చైతన్యవంతం చేసేందుకే తాను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. తెలుగు భాషకు పునర్ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాజకీయ పార్టీ పని చేయబోతోందన్నారు. జై తెలుగు పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో పోటీ చేయబోతున్నట్లు జొన్నవిత్తుల పేర్కొన్నారు. ఆగస్ట్ 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయిందని జొన్నవిత్తుల అన్నారు. భాషా సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు మదరాసీలు అన్నారని.. నేడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామని, కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామని జొన్నవిత్తుల ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష రథాన్ని ప్రజలు లాగాలనేది తన ఆకాంక్షగా జొన్నవిత్తుల చెప్పుకొచ్చారు.