త్వరలో ఏపీలో కొత్త రాజకీయ పార్టీ..!
New Political Party In AP. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రస్తుతమున్న పార్టీల ఎత్తులు..
By Medi Samrat Published on 11 Feb 2023 1:42 PM GMT
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ప్రస్తుతమున్న పార్టీల ఎత్తులు.. పైఎత్తులు.. పొత్తులపై ప్రకటనలు, పాదయాత్రలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ మరింత రాజుకుంటుంది. అధికార వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వేటికవే ప్రత్యేకంగా తమవైన వ్యూహాలతో దూసుకుపోతుండగా.. రానున్న రోజుల్లో వీటికి ప్రత్యామ్నయంగా మరో రాజకీయ పార్టీ రాబోతోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా చేశారు. రాబోతున్న పార్టీ ఎవరిది? ఆ ప్రకటన ఎవరు చేశారు? తెలుసుకుందాం.
త్వరలో ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయ బోతున్నట్లు మాజీ ఐఏఎస్ అధికారి వీజీఆర్ నారగోని, బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ శుక్రవారం ప్రకటించారు. ఇతర పార్టీల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పార్టీ లోకి రానున్నారని ప్రకటన రోజే వారు వెల్లడించారు. బహుజనుల హక్కుల కోసం తాము నూతనంగా స్థాపించబోయే పార్టీ పని చేస్తుందని తెలిపారు. బీసీల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఐక్యం చేస్తామన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు వెనుకబడిన వర్గాలను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే భావిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల రక్షణ కోసం నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం ఒకే పార్టీ.. ఒకే జెండా ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ, టీడీపీలు బీసీలకు అన్యాయం చేశాయని విమర్శించారు. త్వరలో భారీ సభ ద్వారా నూతన పార్టీ పేరు, జెండా ప్రకటిస్తామన్నారు.