ఏపీలో కొత్త లిక్కర్‌ పాలసీ.. ఎప్పటి నుంచంటే?

అమరావతి: కొత్త లిక్కర్‌ పాలసీ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

By అంజి  Published on  2 Aug 2024 5:30 PM IST
new liquor policy, Andhra Pradesh, APnews

ఏపీలో కొత్త లిక్కర్‌ పాలసీ.. ఎప్పటి నుంచంటే?

అమరావతి: కొత్త లిక్కర్‌ పాలసీ విధానం రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. నూతన విధానం రూపకల్పన విషయమై.. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన నాలుగు బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లనున్నాయి.

ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు. ఈ అధికారుల బృందాలు.. ఆయా రాష్ట్రాల్లోని ఎక్సైజ్‌ పాలసీ, మద్యం షాపులు, బార్లు, ధరలు, మద్యం కొనుగోళ్లు, నాణ్యత, చెల్లింపుల విధానం, డిజిటల్‌ పేమెంట్‌ అంశాలపై అధ్యయనం చేయనున్నాయి. డీ అడిక్షన్‌ సెంటర్ల నిర్వహణ, ట్రాక్‌ అండ్‌ ట్రేస్‌ వంటి అంశాలపై ఫోకస్‌ పెట్టనున్నారు.

ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లోని అత్యుత్తమ మద్యం విధానాలపై ప్రభుత్వానికి బృందాలు రిపోర్ట్‌ ఇవ్వనున్నాయి. ఆగస్టు 12వ తేదీ లోగా రిపోర్ట్స్‌ సబ్మిట్‌ చేయాలని నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అక్టోబరు 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్‌ చేస్తోంది.

Next Story