వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవాబ్‌పేట్ దాడి ఘటనలో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పరామర్శించారు. మంగళవారం సాయంత్రం విజయవాడ ఆస్పత్రిలో జగన్ వారిని పరామర్శించారు. నవాబ్‌పేటలో ప్లాన్ ప్రకారమే కర్రలతో కొట్టారని.. సుమారు 20 మంది కలిసి దాడి చేశారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందని ఆరోపించారు వైఎస్ జగన్. ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారన్నారు వైఎస్ జగన్.
ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా.. వైసీపీ నేతలపై దాడులు ఆపాలన్నారు వైఎస్ జగన్. ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అరాచకాలను ఇతర రాజకీయ పార్టీలకు వివరించామన్నారు.. జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లామని.. వీలైతే హై కోర్టు.. అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్తామన్నారు వైఎస్ జగన్. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాలన మీద దృష్టి పెట్టడం లేదు. మేనిఫెస్టోలో హామీల్ని నెరవేర్చడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి దాడుల్ని ప్రొత్సహిస్తున్నారని.. స్కూళ్లు, ఆస్పత్రుల్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్.