డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. ఇకపై ఏపీలో ప్రకృతి వైద్య విధానాల ప్రోత్సాహం, ప్రజల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య విధానాల రూపకల్పనలో డాక్టర్ మంతెన ప్రభుత్వానికి సలహాలు అందించనున్నారు.
మంతెన సత్యనారాయణ రాజు గత కొన్ని దశాబ్దాలుగా ప్రకృతి వైద్యాన్ని ప్రజల జీవితాలకు దగ్గర చేసే ప్రయత్నంలో ఉన్నారు. విజయవాడ సమీపంలోని ఉండవల్లి కరకట్టపై ఏర్పాటు చేసిన ‘ప్రకృతి చికిత్సాలయం’ ద్వారా వేలాది మందికి సేవలందించారు. టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్ల వంటి వివిధ మాధ్యమాల ద్వారా కూడా ఆయన ప్రకృతి వైద్య విధానాన్ని విస్తృతం చేస్తున్నారు.