ఏపీలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలోని వాగులు, వంకలు, నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా వందల గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని గుర్తించి అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రోడ్లు కాలువలను తలపిస్తుండడంతో జనజీవనం స్తంభించింది.
వర్షాలకు పెన్నా నదిలో వరద నీరు పోటెత్తుతోంది. కోవూరు సమీపంలోని దామరమడుగు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి(చెన్నై–కోల్ కతా) కోతకు గురైంది. పడుగుపాడు వద్ద కూడా హైవే ధ్వంసం అయ్యింది. దీంతో విజయవాడ-నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒక వైపు నుంచే రాకపోకలకు అవకాశం ఉండడంతో 5 కి.మీ మేర వాహనాలు బారులు తీరాయి. పలు మార్గాల్లో వాహనాలను అధికారులు దారి మళ్లించారు.
ఇక తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను తొట్టంబేడు చెక్ పోస్ట్ వద్ద ఆపివేస్తున్నారు. కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇటు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు భారీ సంఖ్యలో రోడ్డుపై నిలిచిపోయాయి. ఒంగోలు–నెల్లూరు మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. సంగం మండలం కోలగట్ల వద్ద ముంబై హైవేపై వరద తగ్గడంతో పోలీసులు వాహనాలకు అనుమతి ఇచ్చారు.