దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఏలూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఏపిలో మొదటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉంటూ వస్తున్నారు చింతమనేని. గతంలో ఆంధ్రప్రదేశ్ లో తహశీల్దార్ వనజాక్షి విషయంలో చింతమనేని వివాదం ఎంత రచ్చ రచ్చ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఘటనలో తహశీల్దార్ ఫిర్యాదుతో ముసునూరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదైంది. అప్పట్లో ఈ విషయం టీడీపీని ఒక్క కుదుపు కుదిపేసింది. తాజాగా దులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బుధవారం పెదవేగీ మండలంలోని బి.సింగవరంలో చింతమనేని ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంచేసి ఆయన వెళ్లిపోయిన కొద్ది సేపటికే అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అయితే ఈ గొడవలకు కారణం ఆయన ప్రచారం అని.. గొడవలకు ప్రేరేపించారనే ఆరోపణలతో పోలీసులు ఆయనను ఈ రోజు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఘటనాస్థలంలో చింతమనేని లేకున్నా ఈ కేసులో ఆయన పేరు చేర్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనినేని ప్రభాకర్ను అరెస్టు చేయటం అప్రజాస్వామికమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.

పంచాయతీ ఎన్నికల్లో వైసిపిను ఓటమి భయం వెంటాడుతున్నందునే.. చింతమనేనిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి వైసీపీ కుట్ర అని.. వైసీపీ ఓడిపోతారని భయంతో ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బి.సింగవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో అక్కడ లేని వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యటం రాజారెడ్డి రాజ్యాంగానికి మాత్రమే చెల్లిందని దుయ్యబట్టారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story