యువగళం పాదయాత్రను ముగించిన నారా లోకేశ్
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్ తన పాదయాత్రకు ముగింపు పలికారు
By Medi Samrat
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్ తన పాదయాత్రకు ముగింపు పలికారు. పైలాన్ ఆవిష్కరించిన అనంతరం లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం అని స్పష్టం చేశారు. అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుక అయిందని.. యువగళం ప్రజాగళమై నిర్విరామంగా సాగిందని లోకేశ్ అన్నారు. ఒక అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశాడని.. ప్రజాస్వామ్యంపై, వ్యవస్థలపై జరిగిన దాడిని కళ్లారా చూశానని అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు యువగళం ద్వారా భరోసా ఇచ్చానని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉంటానని లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
లోకేశ్ తన పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్లు నడిచారు. 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యువగళం సాగింది. జనవరి 27న ప్రారంభమై 226 రోజుల పాటు కొనసాగింది నారా లోకేష్ పాదయాత్ర. ఈరోజు నారా లోకేష్‌కు గాయమైంది. పరవాడ మండలంలోకి పాదయాత్ర వచ్చే సమయంలో లోకేష్ కుడిచేతి చీలమండకు కొద్దిపాటి గాయమైంది. పాదయాత్రలో లోకేష్ అభిమానులకు అభివాదం తెలిపే సమయంలో ఆయన చేతిని ఒక వ్యక్తి బలంగా నొక్కాడు. దీంతో చేతి చీలమండపై నరం ఒత్తిడికి గురై వాచిపోయింది. గాయమైనా సరే లోకేష్ పాదయాత్రను కొనసాగించారు. అభిమానులకు కరచాలనం చేసేటప్పుడు ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించారు.