ఖైదీ నెంబర్ 6093 డ్రెస్ ఉతికించి పెట్టుకో: నారా లోకేష్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళతారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.

By Medi Samrat  Published on  25 Nov 2023 2:30 PM IST
ఖైదీ నెంబర్ 6093 డ్రెస్ ఉతికించి పెట్టుకో: నారా లోకేష్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళతారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బయట అధికారం చెలాయిస్తున్నారన్నారు. జైలుకు వెళ్లే సమయం దగ్గర పడింది.. అవినీతి చక్రవర్తి జగన్ తనకు కేటాయించిన ఖైదీ నెంబర్ 6093 డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలంటూ లోకేశ్ అన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంపీ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, జగన్ తో పాటు సీబీఐకి రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ నారా లోకేశ్ జగన్ పై విమర్శలు గుప్పించారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని రఘురాజు తరపు న్యాయవాది ధర్మాసనంకు తెలిపారు. జగన్ తోపాటు, సీబీఐ, ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా వద్దా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురాజు న్యాయవాది కోర్టును కోరారు.

Next Story