లోకేశ్.. నాపై ఆరోపణలు రుజువు చేశాకే నువ్వు కర్నూలు దాటాలి'
టీడీపీ నేత నారా లోకేష్‌పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని,
By అంజి Published on 8 May 2023 11:43 AM IST'లోకేశ్.. నాపై ఆరోపణలు రుజువు చేశాకే నువ్వు కర్నూలు దాటాలి'
టీడీపీ నేత నారా లోకేష్‌పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఫైర్ అయ్యారు. తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని, అప్పుడే కర్నూలు దాటి వెళ్లాలని డిమాండ్ చేశారు. లోకేష్ తనపై చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ''నీ టెంటు దగ్గరకు వస్తా.. అక్కడే చర్చిద్దాం. నాపై ఆరోపణలు రుజువు చేయకపోతే నారా లోకేష్ క్షమాపణ చెప్పాలి'' అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. తనపై చేసిన ఆరోపణలపై చర్చించడానికి ఖురాన్ పట్టుకుని ఏ మసీదు దగ్గరకైనా, దర్గాకైనా వస్తానన్నారు. రమ్మంటే గౌరవంగా వస్తానని, లేదంటే ఏదో సమయంలో వచ్చి మీతో చర్చిస్తానని హఫీజ్ ఖాన్ అన్నారు. పాదయాత్రలో ఎక్కడ కలవాలో చెప్పి లోకేష్ తన మర్యాద కాపాడుకోవాలన్నారు.
అలా చేయకపోతే తానే సాయంత్రంలోపు వస్తానని చెప్పారు. పాదయాత్ర దగ్గరకు వచ్చేటప్పుడు నా అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ రారని, తాను ఒక్కడినే వస్తానని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించాలని అన్నారు. నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు, ప్రజలకు పనిచేసేందుకు అమెరికాలోని లగ్జరీ లైఫ్ వదులుకొని వచ్చిన వ్యక్తిని తాను అని హఫీజ్ ఖాన్ అన్నారు. ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు. ఇప్పటికైన లోకేశ్ తన తీరు మార్చుకోవాలన్నారు. ప్రస్తుతం నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం ఉదయం ఎస్‌టీబీసీ గ్రౌండ్ విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు.