వైఎస్ జగన్ ను కలవడం లేదని తేల్చి చెప్పిన బాలయ్య
Nandamuri Balakrishna About Meeting With Jagan. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తాను కలవనని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు
By Medi Samrat Published on 15 Feb 2022 2:51 PM ISTఏపీ సీఎం వైఎస్ జగన్ ను తాను కలవనని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇప్పట్లో ఆయనను కలిసే అవకాశం లేదని అన్నారు. సీఎం జగన్ ను కలవడానికి రావాలని తనను పిలిచారని అయినా తాను వెళ్లలేదని చెప్పారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే తన తాజా చిత్రం 'అఖండ' ఘన విజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టిందని తెలిపారు. తన చిత్రాలు లిమిటెడ్ బడ్జెట్లోనే ఉంటాయని, టికెట్ ధరలు తన చిత్రాలపై ప్రభావం చూపబోవని అన్నారు. తన సినిమాల బడ్జెట్ ను తాను పెంచనని చెప్పారు.
ఏపీ సీఎం జగన్ తో సినీ పరిశ్రమ వర్గాల్లోని ప్రముఖల భేటీపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శలు చేశారు. తప్పు లేనప్పుడు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆత్మాభిమానాన్ని చంపుకుని జగన్ దగ్గరకు ఎందుకు పోవాల్సి వచ్చిందంటూ కొన్ని ప్లాట్ ఫాంలలో చూశానని, ఇండస్ట్రీకి పెద్దగా ఉండే వ్యక్తి ..వైఎస్ దగ్గరకు పోయి ఎందుకు దండం పెట్టుకోవాల్సి వచ్చిందని చాలా మంది అంటున్నారని గుర్తు చేశారు. 'నేనే పెద్ద నటుడిని అనుకుంటే.. నా కంటే పెద్ద నటుడివి నువ్వు' అని అర్థం వచ్చేలా మాత్రమే జగన్ కు చిరంజీవి దండం పెట్టారన్నారు.
అంతే తప్ప ఆ దండంలో వేరే ఉద్దేశమేమీ లేదని చెప్పారు. వైజాగ్ లో ఇప్పటికే ఏర్పాటు చేసిన రామానాయుడు స్టూడియో భూమిని లాక్కోవడానికి సీఎం జగన్ ప్రయత్నించారని గుర్తు ఆయన గుర్తు చేశారు. జగన్ చేష్టలు చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. రాష్ట్రంలో ఆ 151 మంది తప్ప జగన్ ను పొగిడే వ్యక్తి ఎవరూ లేరని అన్నారు. ఆయనే లేని సమస్యను సృష్టించి, ఇండస్ట్రీ వాళ్లను పిలిపించుకుని, ఆ సమస్యకు పరిష్కారం చూపించినట్టు సినీ ప్రముఖులకు గీతోపదేశం చేసి వారితో పొగిడించుకునే పరిస్థితికి వచ్చారన్నారు.