ఆంధ్రప్రదేశ్ శాసన సభ సభ్యుల కోటాలో ప్రకటించబడిన ఐదు శాసన మండలి సభ్యుల (MLC) ఎన్నికకు కూటమి తొలి అభ్యర్థిగా కొణిదెల నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర శాసన సభ భవనంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి ఆర్. వనితా రాణికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎం.ఎల్.సి. అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ఆయన వెంట రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు.
నాగబాబు తన నామినేషన్ పత్రంతో పాటు ‘బి’ ఫార్ము, అఫడవిట్, సెక్యురిటీ డిపాజిట్ తదితర పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణి ఆ నావినేషన్ పత్రాలను పూర్తిగా పరిశీలించిన పిదప భారత సంవిధానపు 173 (ఎ) పరచ్చేదము ప్రకారం ఆయనచే ప్రతిజ్ఞ చేయించారు. సహాయ రిటర్నింగ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ సహాయ కార్యదర్శులు ఆర్. శ్రీనివాసరావు, ఎం. ఈశ్వరరావు నావినేషన్ తదితర పత్రాల పరిశీనలో రిటర్నింగ్ అధికారి సహకరించారు.