ఎవరికీ చెక్ పెట్టాల్సిన అవసరం లేదు, పిఠాపురం అడ్డా ఆయనదే..ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on  10 March 2025 4:56 PM IST
Andrapradesh, Nadendla Manohar, tdp, Janasena, Mlc Ticket Issue,  Tdp Varma

ఎవరికీ చెక్ పెట్టాల్సిన అవసరం లేదు, పిఠాపురం అడ్డా ఆయనదే..ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అడ్డాగా మారిపోయిందని, ఇక్కడ ప్రత్యేకించి ఎవరికి చెక్ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కకపోవడం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జనసేన నేతలు అడ్డుపడే వర్మకు ఎమ్మెల్సీ టిక్కెట్ రాకుండా చేశారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సీనియర్ రాజకీయ నేత అని, వర్మ అంశం టీడీపీ అంతర్గత వ్యవహారమన్నారు. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం లేదన్నారు.

వర్మ చాలా సీనియర్ రాజకీయ నేత. ఆయన కూడా సుధీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారు. గతంలో ఎన్నో ఇబ్బందులుపడటం మనమంతా చూశామన్నారు. అయితే, పదవులు, టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలన్నది ఆయా పార్టీల అంతర్గత విషయమన్నారు. వర్మ విషయం కూడా టీడీపీ అంతర్గత విషయమని చెప్పారు. గత ఎన్నికల్లో ఆయన పవన్ కళ్యాణ్‌కు ఎంతగానో సహకరించారన్నారు. ఆయనపై తమకు గౌరవరం ఉందని, ఆయనకు సముచిత గౌరవం దక్కాలని కోరుకుంటున్నామని తెలిపారు. పిఠాపురం ప్రజలకు కృతజ్ఞత చెప్పేందుకే ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామన్నారు. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున సభకు హాజరు కావాలని కోరారు.

Next Story