జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ నిధులను మళ్లించి దివాళా తీయించిందని ఆరోపించారు. సొంత డబ్బు ఖర్చు చేసిన అధికార పార్టీ సర్పంచ్ ధనలక్ష్మి ఆర్థిక ఒత్తిళ్లతో ఆత్మహత్య చేసుకుందని అన్నారు. అకాల వర్షాలకు నాలుగున్నర లక్షల ఎకరాల పంట నష్టపోతే ప్రతి గింజా కొంటామన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఇప్పటి వరకు నిర్మించలేని ప్రభుత్వం ప్రకాశం జిల్లాను అంధకారంలోకి నెట్టేసిందని అన్నారు. జనసేన పార్టీ అవకాశవాద, స్వార్ధ రాజకీయాలకు దూరంగా ఉంటుందని తెలిపారు అధికారంలోకి రాక ముందు ఒకలా వచ్చాక మరోలా భాష మార్చి మాట్లాడదని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి 20 ఏళ్లు పూర్తవుతోంది. దాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో వై.వీ సుబ్బారెడ్డి చెప్పగలరా అని నాదెండ్ల ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు మనోహర్. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటం సభలోనే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అనే గొప్ప నిర్ణయం ప్రకటించారని తెలిపారు. ఈ ప్రభుత్వ అవినీతి, దుర్మార్గాలు, దాష్టికాలను దృష్టిలో పెట్టుకుని అంతా కలసి ముందుకు వెళ్లాలని నిర్ణయించారన్నారు. రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తామని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.