భయాందోళనలకు గురి చేస్తున్న N440K వైరస్.. ఇంతకూ ఏపీలో ఉన్నట్లా.. లేనట్లా..?

N440K Virus Symptoms In Andhra Pradesh. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందని తెలిపారు. ఈ వైరస్‌ను తొలిసారిగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారని

By Medi Samrat  Published on  5 May 2021 10:13 AM GMT
N440K virus

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను ప్రకటించారు. ఉదయం 6 నుండి 12 వరకూ మాత్రమే షాపులను తెరచుకోడానికి అనుమతులు ఇస్తున్నారు. రాష్ట్రంలో కొత్త రకం కరోనా వైరస్ వచ్చిందని.. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కరోనా కొత్తగా వచ్చిన 'వైరస్ ఎన్ 440కె' కారణమనే ఊహాగానాలు కూడా ఎక్కువయ్యాయి. కొత్త కరోనావైరస్ వేరియంట్.. మునపటి వైరస్ వేరియంట్ల కంటే 15 రెట్లు అత్యంత తీవ్రమైనదిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు N440K అనే ఈ కొత్త కొత్త కరోనావైరస్ వేరియంట్ ను కనుగొన్నారు. విశాఖపట్నం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో వేరియంట్ విజృంభిస్తోందని చెబుతున్నారు. కరోనా వేరియంట్లలో భారతీయ వేరియంట్ B1.617, B1.618 వేరియంట్ల కంటే ప్రమాదకరంగా ఉండవచ్చునని అంటున్నారు. ఈ ఏపీ స్ట్రెయిన్ ఎంత ప్రాణాంతకమో ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందని తెలిపారు. ఈ వైరస్‌ను తొలిసారిగా సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారని.. కరోనాకు చెందిన ఇతర వైరస్‌ల కంటే కన్నా ఇది 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏపీలో లాక్‌డౌన్‌కు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా తీవ్రత కారణంగా ఇప్పటికే ఏపీకి పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిందని చంద్రబాబు అన్నారు. వ్యాక్సినేషన్ కోసం పలు రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పెట్టాయన్న చంద్రబాబు.. ఈ విషయంలో జగన్ సర్కార్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఏపీలో కొత్త రకంగా కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందిందనే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పందించారు. ప్రస్తుతమున్న స్ట్రెయిన్‌ గతేడాది జూలై నుంచే రాష్ట్రంలో ఉందన్నారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కూడా కొత్త స్ట్రెయిన్‌ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదని చెప్పారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త స్ట్రెయిన్‌ వల్లే కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయనడం సరికాదన్నారు.


Next Story