kurnool: తవ్వకాల్లో దొరికిన ఇనుప అల్మరా.. భారీగా నిధి ఉండొచ్చని అనుమానం.!
కర్నూలు జిల్లా దేవన కొండడ మండలం కరివేములలో ఇంటి యజమాని ఓ తన కొత్త భవనం నిర్మాణం కోసం పాత ఇంటిని కూల్చి వేస్తుండగా..
By అంజి Published on 4 April 2023 8:43 AM GMTkurnool: తవ్వకాల్లో దొరికిన ఇనుప అల్మరా.. భారీగా నిధి ఉండొచ్చని అనుమానం.!
ఇటీవల కాలంలో తరచూ పురాతన వస్తువులు, నిధులు బయటపడుతున్న విషయాలను మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి వింత ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. కర్నూలు జిల్లా దేవన కొండడ మండలం కరివేములలో ఇంటి యజమాని ఓ తన కొత్త భవనం నిర్మాణం కోసం పాత ఇంటిని కూల్చి వేస్తుండగా.. ఆ స్థలంలో పాత కాలం నాటి ఇనుప అల్మరా బయటపడింది. ఈ విషయంతో గ్రామం మొత్తం పాకింది. దీంతో భారీ అల్మారాలో ఏముందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. వివరాల్లోకి వెళితే.. చాకలి నరసింహులు ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఇనుప అల్మరా దొరకింది. ఈ అల్మారాలో బంగారం ఉందనే ప్రచారం జరగడంతో గ్రామస్తులు దానిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఎవరూ అల్మరా తెరవవద్దని ఆదేశించారు.
కరివేముల గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ఇంటిని చాకలి నరసింహులు ఏడాది క్రితం రూ.9.30 లక్షలు వెచ్చించి స్థలాన్ని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిసింది. కాగా అల్మారా తమ పూర్వీకులదేనని కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఇది తన స్థలం అని, అల్మరా తనదేనని నరసింహులు అన్నారు. నేటి లాకర్‌లను పోలి ఉన్న ఈ పెట్టెపై ఇంగ్లీషులో మద్రాసు అని రాసివుంది. దానిపైన లక్ష్మీదేవి బొమ్మ ఉంది. అయితే ఈ అల్మరాలో ఏముందో చూడాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్మారా పాత కాలానికి చెందినది కావడంతో భారీ నిధి ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే చివరికి అందులో ఏం ఉంది. అది ఎవరికి చెందుతుందో వేచి చూడాల్సి ఉంది. ఒక వేళ అందులో నిధి ఉందని తేలితే ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ ప్రకారం అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.