ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్-సీఈవో)గా ముకేష్ కుమార్ మీనా నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) గా కొనసాగుతున్న కె.విజయానంద్ స్థానంలో మీనాను నియమిస్తూ.. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఏపీ ప్రభుత్వంతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముకేష్ కుమార్ మీనా ఉమ్మడి రాష్ట్ర కేడర్‌ను ఎంచుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఏపీ కేడర్‌కు ఆప్షన్ ఇవ్వగా...ఆ మేరకే ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఏపీ వాణిజ్య పన్నులు, చేనేత, జౌళి, ఆహార పరిశ్రమల శాఖల కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు. గతంలో రాజ్‌భవన్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో త్వరలోనే ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.