నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో కర్నూలు రేంజి డీఐజీ విజయరావు ఇద్దరు పోలీసుల అధికారులపై ససెన్షన్ వేటు వేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్, ముచ్చుమర్రి ఎస్సై జయశేఖర్ లను సస్పెండ్ చేశారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఐజీ హెచ్చరించారు.
ముచ్చుమర్రిలో ఓ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కృష్ణా నదిలో బాలిక మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. జూలై 7న నందికొట్కూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల చిన్నారి సమీపంలోని మైదానంలో ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఆరు, ఏడు తరగతులు చదువుతున్న ముగ్గురు మైనర్లు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడతామనే భయంతో బాలికపై అత్యాచారం చేసి కాలువలోకి తోసి హత్య చేసినట్లు మైనర్ బాలురు ఒకరు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.