శుక్రవారం ఒక్కరోజే లక్షకు పైగా దిశ యాప్ రిజిస్ట్రేషన్‌లు జరిగాయని.. కృష్ణా జిల్లా పోలీసుల కృషిని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం కొనియాడారు. గన్నవరం పోలీసులు చేపట్టిన మెగా రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో మొత్తం 1,02,027 మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లా పోలీసులు నిర్వహించిన దిశ యాప్ స్పెషల్ డ్రైవ్‌లో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యాసంస్థలు, బస్ స్టేషన్లు, తదితర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్‌ను పర్యవేక్షించారు. మహిళల భద్రతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలకు దిశా యాప్ ఉపయోగాలను వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 3.98 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. దిశా యాప్ మహిళలకు 'కవచం' గా ఉంటుందని.. యాప్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తే పోలీసులు త్వరితగతిన రియాక్ట్ అవుతారని అన్నారు.
ఈ మేరకు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో.. ఒకే రోజు 1.02 లక్షల దిశ యాప్ రిజిస్ట్రేషన్లు చేయించి రికార్డు సృష్టించిన కృష్ణా జిల్లా పోలీసులకు నా అభినందనలు. మహిళలకు రక్షణ కవచంలాంటి ఈ యాప్ ను జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. ప్రతి మహిళా తమ మొబైల్ లో దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని రాసుకొచ్చారు.