నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రఘురామ కృష్ణం రాజు నేడు విడుదల అవుతారని అంతా బావిస్తుండగా.. ఆయన విడుదల అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆయన తరుపు న్యాయవాదులు గుంటూరు జిల్లా కోర్టుకు చేరుకున్నారు. వ్యక్తిగత పూచికత్తు వారు సమర్పించారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ సైనికాసుపత్రిలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితిని మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి డిశ్చార్జి సమ్మరి కోరారు. ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని మేజిస్ట్రేట్‌కు తెలిపారు. దీంతో డాక్టర్లు తుది నివేదిక ఇచ్చిన తరువాతే రఘురామ విడుదలయయే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ సీఐడీ పోలీసులు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు. తొలుగు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న ఆయన్ను సుప్రీం కోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు డాక్టర్లలతో కూడిన బృందం ఆయన్ను పరీక్షించింది. ఆ తరువాత బెయిల్, వైద్య పరీక్షల నివేదికలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనంతరం ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు చెల్లించాలని.. అలాగే కేసు గురించి మీడియాతోగానీ, సోషల్ మీడియాలో గానీ మాట్లాడవద్దని షరతు విధించింది.