ఏపీ రాజకీయాల్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే టీడీపీకి దూరమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ సీఎం జగన్ ను కలిశారు. కేశినేని నాని, తన కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారిరువురు సీఎం జగన్ తో సమావేశమై పలు అంశాలపై చర్చ జరిపారు. తండ్రి బాటలోనే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించగా కేశినేని శ్వేత ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. విజయవాడలోని కేశినేని భవన్ వద్ద టీడీపీ జెండాలను, చంద్రబాబు ఫొటోలను వారు కొన్నిరోజుల కిందటే తొలగించారు.
చంద్రబాబు తిరువూరు రా కదలి రా సభతో కేశినేని సోదరుల మధ్య వివాదం రేగింది. ఇరు వర్గాలు కొట్లాటకు దిగడంతో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ గొడవ జరిగిన ఒకటి రెండు రోజుల్లోనే కేశినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు.