కాల్ మనీ గాళ్లకు సమాధానం చెప్పను
ఇటీవల టీడీపీని వీడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరారు.
By Medi Samrat Published on 20 Jan 2024 6:30 PM IST
ఇటీవల టీడీపీని వీడిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీపై ఎప్పటికప్పుడు ఆయన విరుచుకుపడుతూ ఉన్నారు. తన మీద విమర్శలు చేసిన వారికి ధీటుగా సమాధానం ఇస్తూ ఉన్నారు. కాల్‌మనీ గాళ్ల మాటలకు సమాధానం చెప్పనని.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని తెలిపారు.ఉత్తర కుమార ప్రగల్భాలు పలకవద్దని కేశినేని చిన్నికి ఎంపీ నాని సూచించారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతనే వైసీపీలో చేరానని ఆయన తెలిపారు. ఏపీ సీఎం జగన్ పిలుపు మేరకే వైసీపీలో చేరానని వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని కేశినేని నాని అన్నారు. అవసరమైతే 100 శాతం కూడా ఖాళీ చేయిస్తానని సవాలు విసిరారు.
రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి, తన స్థాయి ఒకటేనని అన్నారు. నారా లోకేశ్ స్థాయి తనతో పోల్చుకుంటే చాలా తక్కువని చెప్పారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కూడా పాల్గొన్నారు.గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని చెప్పారు. ప్రజలంతా జగన్ వెనుక ఉన్నారని... వైసీపీలో నాయకుల పాత్ర తక్కువ, ప్రజల పాత్ర ఎక్కువ ఉంటుందని అన్నారు.