ఏపీ రైల్వే అభివృద్ధిపై టీడీపీ ఎంపీ కీలక ప్రతిపాదనలు

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్ స‌భ‌లో బుధ‌వారం ప్ర‌వేశ‌పెట్టిన ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సంపూర్ణ మద్దతు తెలిపారు.

By -  Medi Samrat
Published on : 4 Feb 2026 4:39 PM IST

ఏపీ రైల్వే అభివృద్ధిపై టీడీపీ ఎంపీ కీలక ప్రతిపాదనలు

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంపై లోక్ స‌భ‌లో బుధ‌వారం ప్ర‌వేశ‌పెట్టిన ధన్యవాద తీర్మానానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్ర‌ప‌తి ప్రసంగం దేశం దేశం మౌలిక వసతుల ఆధారిత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందనే అంశం ప్ర‌తిబింబిస్తోంద‌న్నారు. ఈ మేర‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్ర‌సంగం (లెడ్ ఆన్ ది టెబుల్) స‌భ‌కు దాఖ‌లు చేశారు.

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, రికార్డు స్థాయి పెట్టుబడులు, వేగవంతమైన ప్రాజెక్టుల అమలు, ఆధునీకరణ చర్యలతో దేశవ్యాప్తంగా అనుసంధానం త్వ‌ర‌గా అవుతుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రశంసించారు.

భారతీయ రైల్వే సంస్థ నేడు దేశ అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని, రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, విద్యుదీకరణ, డబ్లింగ్, స్టేషన్ పునరాభివృద్ధి వంటి చర్యలు ప్రయాణికుల సౌకర్యంతో పాటు వాణిజ్యం, పర్యటన, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గటంతో పాటు, చివరి మైలు అనుసంధానం కూడా మెరుగుపడిందన్నారు.

అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తూ రైల్వే ప్రాజెక్టులకు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌, అనుమతులు, కావాల్సిన‌ సహకారం అందిస్తోందని ఎంపీ కేశినేని శివ‌నాథ్ పేర్కొన్నారు. ఈ సహకార ఫెడరలిజం భావనే మౌలిక వసతుల సకాలంలో అమలుకు కీలకమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రైల్వే అంశాలను కూడా ఎంపీ ప్రస్తావించారు. వ్యవసాయం, ఎరువుల రవాణా, పరిశ్రమల లాజిస్టిక్స్‌కు మద్దతుగా రాష్ట్రంలో కొత్త రైల్‌హెడ్‌ల మంజూరు చేయాలని, అలాగే అమరావతితో పాటు ఇతర అభివృద్ధి కేంద్రాలకు కొత్త రైల్వే మార్గాల కోసం సర్వేలు, అనుమతులను వేగవంతం చేయాలని కోరారు.

స్టేషన్ ఆధునీకరణ పనులను సమయానికి పూర్తిచేస్తే ప్రయాణికులకు మ‌రిన్నీ సౌక‌ర్యాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని,, రాష్ట్రంలోని ప్రాంతీయ అనుసంధానం బలపడుతుందని తెలిపారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంలో పేర్కొన్న జాతీయ మౌలిక వసతుల దృష్టికి పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిరంతర మద్దతుతో పాటు రాష్ట్ర స్థాయి సహకారం కొనసాగితే, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం, పరిశ్రమ, పర్యటన, సేవల రంగాల్లో దేశంలోనే ప్రధాన హబ్‌గా ఎదుగుతుందని ఎంపీ కేశినేని శివ‌నాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

Next Story