విశాఖ రైల్వే జోన్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టత ఇస్తూ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు అవకాశం లేదన్న వార్తలను కొట్టిపారేశారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటవుతుందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ మేరకు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై గత పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని జీవీఎల్ నరసింహారావు అన్నారు. తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సమాధానం చెప్పారని గుర్తు చేశారు.
ఈ రోజు సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్ వీకే త్రిపాఠితో మాట్లాడినట్లు తెలిపిన జీవీఎల్.. రైల్వే జోన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, విశాఖ రైల్వే జోన్‌పై తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం విశాఖపట్నం రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని రైల్వే అధికారులు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఏపీ విభజన చట్టం హామీలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశాఖ రైల్వేజోన్ పై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విశాఖపట్నం రైల్వేజోన్ వార్తలను కూడా కొట్టిపారేశారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోతే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.