తన భార్య, కుమారుడి కిడ్నాప్‌ను రాజకీయం చేయడం దురదృష్టకరమని వైసీపీ నేత, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బుధవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రౌడీషీటర్లు హేమంత్, రాజేష్ పక్కా ప్లాన్ ప్రకారం కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని, హేమంత్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని అన్నారు. “నేను అతనికి ఫోన్ చేయడం లేదా అతను నాకు ఫోన్ చేశాడో తెలుసుకునేందుకు మీరు గత ఐదేళ్ల నా కాల్ డేటాను తనిఖీ చేయవచ్చని చెప్పారు. జూన్ 13న హేమంత్‌తో పాటు మరికొందరు మా ఇంట్లోకి చొరబడి నా కొడుకును చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. అదే రోజు నా కొడుకు శరత్.. నా భార్యకు ఫోన్ చేసినా ఆమె మరుసటి రోజు వెళ్లిందని తెలిపారు. హేమంత్ రెండు రోజులు మాతోనే ఉంటాడని భీమునిపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు నా కొడుకు చేత బలవంతంగా ఫోన్ చేసి చెప్పించాడని వివరించారు.
తన వ్యాపారానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాపోయారు. శాంతి, ప్రశాంతతకు పేరుగాంచిన విశాఖపట్నంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఎంపీ విచారం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై మండిపడ్డారు. తోటి ఎంపీ కుటుంబం అపహరణకు గురై ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిదికాదన్నారు. మీ హయాంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.