విశాఖలో చారిత్రాత్మక గూగుల్ ఏఐ హబ్‌కు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది.

By -  Knakam Karthik
Published on : 13 Oct 2025 5:20 PM IST

Andrapradesh, Vishakapatnam, Google AI Hub, Cm Chandrababu, Nara Lokesh

విశాఖలో చారిత్రాత్మక గూగుల్ ఏఐ హబ్‌కు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు రేపు ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఇది ఏపీ చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. భారత ఏఐ శక్తిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో శ్రీకారం చుట్టనుంది. విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయుపై ఢిల్లీలో సంతకాలు చేయనున్నారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ)గా రికార్డు సృష్టించబోతోంది.

ఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయుపై సంతకాలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ లో దేశంలోనే అగ్రగామిగా నిలపడమే ఒప్పందం ప్రధాన లక్ష్యం.

రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 31వతేదీన శాన్ ఫ్రాన్సిస్కో లో గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ తో జరిపిన చర్చల్లో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎఐ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఆ తరువాత గూగుల్ ప్రతినిధులతో పలుదఫాలుగా జరిగిన చర్చలు కార్యరూపం దాల్చాయి. గూగుల్ ఏఐ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ పూర్తి AI సాంకేతిక వేదికను ఆతిథ్యం ఇవ్వగల అవకాశం లభిస్తుంది. దీని ద్వారా భారతదేశంలో కృత్రిమ మేధస్సు ఆధారిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక నాయకత్వం వహించబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ సంస్థ రాబోయే అయిదేళ్లలో (2026–2030 మధ్య) సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే గూగుల్ చేపట్టే అతి పెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పెట్టుబడి ద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్థాయి. రాష్ట్రంలోని యువత కోసం విస్తృత స్థాయి ఏఐ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. అలాగే, ఈ ఏఐ హబ్ ద్వారా విశాఖపట్నానికి మరిన్ని గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశముంది.

గూగుల్ చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నాన్ని ఏఐ సిటీగా మార్చబోతోంది. విశాఖలో ఏర్పాటుచేసే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన పూర్తి కృత్రిమ మేధ (AI) వ్యవస్థను అమలు చేసి, భారతదేశంలో AI ఆధారిత ట్రాన్సఫర్మేషన్ ను వేగవంతం చేయనుంది. ఈ కొత్త AI హబ్ లో అత్యాధునిక AI మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ సామర్థ్యం, భారీ స్థాయి ఇంధన వనరులు, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లను ఒకేచోట సమన్వయపరచి, విశాఖపట్నాన్ని భారతదేశ AI ట్రాన్సఫర్మేషన్ కేంద్రంగా నిలబెడుతుంది. గూగుల్ గ్లోబల్ నెట్‌వర్క్‌తో సముద్ర గర్బ, భూభాగపు కేబుల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి, క్లీన్ ఎనర్జీతో పనిచేసే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్ట్ 2028–2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్‌డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టిస్తుంది. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.

Next Story