ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా దసరా పండుగ రోజున ఇక్కడ కర్రల సమరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. హోళగుంద మండలం దేవరగట్టు సమీపంలోని కొండపై వెలసిన మాళమ్మ, మల్లేశ్వరస్వామికి రాత్రి 12 గంటలకు కళ్యాణం జరిపించాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా గంట ఆలస్యమైంది. ఓ వైపు వర్షం పడుతుండగానే కళ్యాణం అనంతరం కర్రల సమరం చేశారు. కొండపై ఉన్న పాదాలగట్టు, రక్షపడ, శమీ వృక్షం, ఎదురుబసవన్నగుడి ప్రాంతాల్లో దీపాల కాంతుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు ఓ జట్టుగా.. నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఈ కర్రల సమరంలో 50 మందికి పైగా తీవ్ర గాయాలు కాగా, ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. వారిని ఆదోని, ఆలూరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఉత్సవంలో ఎలాంటి హింస జరగకుండా ఉండేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఫలించలేదు.
నెల రోజుల ముందు నుంచే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘాను మరింత పటిష్ఠం చేసినా.. స్థానికులు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇక ఈ ఉత్సవాలను చూసేందుకు కర్ణాటక, ఏపీకి చెందిన లక్షలాది మందులు భక్తులు వచ్చారు. దేవరగట్టు కర్రల సమరంలో ప్రాణ నష్టం లేకపోవడంతో పోలీసులు, అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కర్నాటకకు చెందిన ఓ బాలుడు దేవరగట్టు కర్రల సమరానికి వెళ్తూ మృతి చెందాడు.