అమరావతి: బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లు మంజూరు చేసే స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమలు కానుంది. ఈ జిల్లాల్లో 1.25 లక్షల బీసీ, 45 వేల ఈడబ్ల్యూఎస్ దరఖాస్తులు రాగా.. నిన్నటి నుంచి ఎంపిక ప్రారంభించారు. ఫిబ్రవరి 25 లోగా లబ్ధిదారులను గుర్తించి కలెక్టర్ ఆమోదిస్తారు. మార్చి 8 నుంచి 12 వరకు ఆయా కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. మార్చి 17 నుంచి 20 మధ్య లబ్ధిదారులకు చేరుతుంది. కాగా స్వయం ఉపాధి లబ్ధిదారులు తప్పనిసరిగా యూనిట్ స్థాపించాల్సి ఉంటుందని ఆయా శాఖలు మార్గదర్శకాలు జారీ చేశాయి.
కాగా అనర్హులను ఎంపిక చేసినా, అర్హులు యూనిట్ ఏర్పాటు చేయకపోయినా ఈడీపై చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. బ్యాంకు అధికారులతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం సమీక్షించారు. జిల్లాలోని బీసీ, ఈబీసీ వర్గాలలో అర్హులైన వారికి స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో 2,156 మంది బీసీలకు రూ.45.84 కోట్లను వివిధ పథకాల కింద రుణాల రూపంలో అందించాలని కోరారు.