త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బుల జమ: మంత్రి అచ్చెన్న
వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు.
By అంజి Published on 15 Nov 2024 7:43 AM GMTత్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బుల జమ: మంత్రి అచ్చెన్న
అమరావతి: వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. కరవు పీడిత మండలాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు జరిగాయి. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్న సమాధానం ఇచ్చారు. ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల పలు మండలాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
అక్టోబర్ 29వ తేదీన 54 కరవు మండలాలను ప్రకటించామన్నారు. 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని చెప్పారు. పరిహారంగా రూ.159.2 కోట్లను మంజూరు చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తమని ప్రకటించారు. నష్టపోయిన వారికి రాయితీతో 47 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామన్నారు. అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కరవు ఏర్పడిందన్నారు.
నదుల అనుసంధానంతో కరవు నివారించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో తెలిపారు. చంద్రబాబు తొలి ప్రాధాన్యం పోలవరమని, రెండోది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని తెలిపారు. వైసీపీ హయాంలో సుజల స్రవంతి ప్రాజెక్టును పట్టించుకోలేదని, తాము వచ్చాక రూ.1600 కోట్లతో టెండర్లు పూర్తి చేశామన్నారు. త్వరగా పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామన్నారు. వచ్చే ఏడాది జులై నాటికి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తామని మంత్రి నిమ్మల తెలిపారు.