గత రబీకి సంబంధించిన రూ.674 కోట్ల ధాన్యం బకాయిలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఏలూరులో జరిగిన రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడిందన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ గత నెలలో 43,350 మంది రైతులకు రూ.వెయ్యి కోట్ల ధాన్యం బకాయిలను చెల్లించామన్నారు. ఇవాళ మరో రూ.674 కోట్లు అందించామని వివరించారు. రాబోయే ఖరీఫ్‌లో 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు.
నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనుకాడబోమని.. చివరి గింజ వరకూ కొంటామని చెప్పారు. అలాగే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతు బజార్ల ద్వారా నాణ్యతగల కందిపప్పు, బియ్యాన్ని డిస్కౌంట్‌పై ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను నాణ్యంగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.