ఏపీకి మోచా తుఫాన్ ఎఫెక్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు
మోచా తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)
By అంజి Published on 7 May 2023 9:00 AM IST
ఏపీకి మోచా తుఫాన్ ఎఫెక్ట్.. మరో 3 రోజులు భారీ వర్షాలు
మోచా తుఫాను దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా ఉన్నంతసేపు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మే 7 నుంచి మే 9 మధ్య తూర్పు తీరాన్ని మోచా తుఫాను తాకే అవకాశం ఉందని ఐఎండీ గతంలో పేర్కొంది. అందువల్ల, రాబోయే మూడు రోజుల పాటు, తూర్పు కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఐఎండీ బులెటిన్ ప్రకారం.. ''ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రదేశాలలో ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన గాలివానలు , ఉరుములతో కూడిన తుఫానుతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. రాయలసీమలో పలు ప్రదేశాలలో 30-4 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.''
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, ఏఎస్‌ఆర్, అనకాపల్లి, ఏలూరు, ఉభయగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, చిత్తూరు, కడప, అన్నమయ్య తదితర జిల్లాల్లో మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశం ఉందని ఇతర వాతావరణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోవడంలో అస్థిరత కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.