వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దువ్వాడను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది.
సస్పెండ్ అవ్వడంపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. వైసీపీలో తనకు ఇంతటి హోదా ఇచ్చిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ కోసం తాను చాలా కష్టపడ్డానని, పార్టీ గొంతై మాట్లానని, పార్టీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శలు చేశానన్నారు. ఇప్పుడు వ్యక్తిగత కారణాలు చూపుతూ సస్పెండ్ చేశారని తెలిసిందన్నారు. ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని.. సస్పెన్షన్‌ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తానన్నారు. తటస్థుడిగా ఉంటూ తనను నమ్ముకున్న అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు దువ్వాడ.