MLC Counting : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభ‌మైన ఎమ్మెల్సీ కౌంటింగ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభ‌మైంది. ఉద‌యం 8 గంట‌ల నుంచి కౌంటింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 March 2023 3:53 AM GMT
MLC counting, MLC counting in AP, MLC counting in TS

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభ‌మైంది. ఉద‌యం 8 గంట‌ల నుంచి కౌంటింగ్ ప్ర‌క్రియ మొద‌లైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మూడు గ్రాడ్యుయేట్‌, రెండు టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానాలు, నాలుగు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు కౌంటింగ్ జ‌రుగుతోంది. తొమ్మిది స్థానాల‌కు గాను మొత్తం 139 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. మార్చి 13న జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది ఓటర్లకు గాను 2,00,924 మంది (69.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.

బ్యాలెట్ విధానంలో ఎన్నిక నిర్వ‌హించారు. కాబ‌ట్టి లెక్కింపు విష‌యంలో అధికారులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. వాటికి ఎదురుగా ఎన్‌క్లోజర్లు పెట్టి అభ్యర్థుల తరపున ఏజెంట్లు కూర్చునేందుకు కుర్చీలు వేశారు. ఏఏ బూత్‌ల బాక్సులు ఏఏ టేబుల్‌పై లెక్కించాలో ముందుగానే నిర్ణయించి ఆ మేరకు ఎన్‌క్లోజర్లపై స్టిక్కర్లు అతికించారు. కౌంటింగ్ నేప‌థ్యంలో ఆయా కేంద్రాల వ‌ద్ద భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

తెలంగాణ‌లో..

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభ‌మైంది. రెండు గదుల్లో మొత్తం 28 టేబుళ్ల‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో గదిలో ముగ్గురు ఏఆర్వోలను, రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వద్ద అదనంగా మరో ముగ్గురు ఏఆర్వోలను నియమించారు. కౌంటింగ్‌లో ఏ అభ్యర్థికీ తొలి ప్రాధాన్య ఓట్లలో 50 శాతానికిపైగా రాకపోతే సెకండ్‌ ప్రయార్టీ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు.

ఈ నెల 13న ఎన్నిక నిర్వ‌హించ‌గా 90.40 శాతం పోలింగ్ న‌మోదైంది. 21 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Next Story