దేవినేని ఉమా.. ఇదేనా నీ సంస్కారం.? : ఎమ్మెల్యే ఫైర్
MLA Vasantha Krishna Prasad Fire On Ex minister Devineni Uma. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 24 April 2023 6:45 PM ISTమాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. దేవినేని ఉమా ప్రవర్తన అతని వెకిలితనానికి నిదర్శనమని.. ఆయన కపట నాటక సూత్రధారి అని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు నివాళులర్పించిన అనంతరం ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయమని అప్పటి శాసనసభ్యుడిని అడిగితే చీత్కరించుకున్నారని గుర్తుచేశారు.
జాతి ఉజ్వల భవితకు నాంది పలికిన మహనీయుల విగ్రహాలను నెలకొల్పే అదృష్టాన్ని తనకు ఇచ్చిన ఈ ప్రాంత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలతో తను ఖర్చుపెట్టే సొమ్ముకు సార్థకత చేకూరుతుందన్నారు. ఈ విగ్రహాలు ఇక్కడ నెలకొల్పిన నాటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా మాజీమంత్రి దేవినేని ఉమా... వారి జయంతులకు కానీ, వర్ధంతులకు కానీ, కనీసం ఒక్క దండ కానీ, ఒక్క పూలమాల కానీ వేయలేదని అన్నారు. ఇవన్నీ వదిలేసి స్టిక్ పెట్టడానికి వాడెవడు, వీడెవడు అంటూ మాట్లాడుతున్నారని.. దేవినేని ఉమా.. ఇదేనా నీ సంస్కారం.?.. ఇదేనా నీ భాష? డెవర్షన్ పాలిటిక్సా..? అసలు నువ్వు అనేదానికి ఏమైనా అర్ధముందా? చేసేది నువ్వు.. చేయించేది నువ్వు.. ఇక్కడ జరిగిన ఘటనను ఎక్కడో జరిగిన హత్యకు ముడి పెట్టావంటే అసలు నువ్వు ఏ జాతికి చెందిన వాడివి.? అంటూ నిప్పులు చెరిగారు.
అటు ప్రజల్లో, ఇటు వాళ్ళ నాయకుల్లో పలుచనై అతీ, గతీ లేక జీవన్మృతుడిగా బతుకుతున్న దేవినేని ఉమాకు డైవర్షన్ పాలిటిక్స్ అవసరం. అందుకే దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు నువ్వు ఎవరు దీని గురించి మాట్లాడటానికి దేవినేని ఉమా? జరిగిన ఘటనకు బాధపడిన మా వైసీపీ నాయకులు, మహనీయుల విగ్రహాల వద్ద కొత్త స్టిక్, కళ్లజోడు మళ్లీ వెంటనే అమర్చారని వివరణ ఇచ్చారు. దీనిపై అనవసరంగా ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నావు. దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తే తప్పులేదు. గతంలో కూడా ఇలానే ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెట్టి ఉనికి కోసం పాకులాడిన చరిత్ర నీది దేవినేని అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.