సింహంతో వేట.. వైఎస్ జగన్‌తో ఆట అంత ఈజీ కాదు: ఎమ్మెల్యే రోజా

MLA Roja fires on chandra babu and nara lokesh . ఆంధ్రప్రదేశ్‌లో ఫైర్‌ బ్రాండ్‌, నగరి ఎమ్మెల్యే రోజా.. ప్రతిపక్ష నాయకులపై పంచ్‌ల వర్షం కురిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై కౌంటర్లు వేశారు.

By అంజి  Published on  18 Nov 2021 3:02 PM IST
సింహంతో వేట.. వైఎస్ జగన్‌తో ఆట అంత ఈజీ కాదు: ఎమ్మెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్‌లో ఫైర్‌ బ్రాండ్‌, నగరి ఎమ్మెల్యే రోజా.. ప్రతిపక్ష నాయకులపై పంచ్‌ల వర్షం కురిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై కౌంటర్లు వేశారు. ఏపీల మహిళా సాధికారతపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్ర మహిళలకు వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉందని పేర్కొన్నారు. అక్కచెల్లెళ్ల కోసం ముఖ్యమంత్రి జగన్‌.. కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నారని.. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నారని అన్నారు.

33 లక్షల ఇళ్లను మహిళల పేరుతోనే ఇచ్చారని, సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను చూసే.. రాష్ట్రంలో ఎక్కడా ఎలక్షన్స్‌ జరిగినా మహిళలు వైసీపీ గెలుపుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు, లోకేష్‌పై ఫైర్‌ అయ్యారు. 14 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఎప్పుడు కూడా మహిళలను పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం అధికారం చేపట్టిన నాటి నుండి మహిళలకు అండగా ఉంటూ వస్తున్నారని పేర్కొన్నారు.

కుప్పం ప్రజలు చంద్రబాబుని తరిమి కొట్టారని, ఇక అక్కడ బాబు పప్పులేమి ఉడకవంటూ ఎద్దేవా చేశారు. కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డా కాదని అన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకున్న చంద్రబాబుకు గల్లీలో ప్రచారం చేసిన ఫలితం లేకపోయిందని సెటైర్‌ వేశారు. సింహంతో వేట.. వైఎస్‌ జగన్‌తో ఆట అంత ఈజీ కాదని టీడీపీకి ఎమ్మెల్యే రోజా వార్నింగ్‌ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్‌లలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఎన్ని సవాళ్లు విసిరినా సీఎం జగన్‌ను ఏమి చేయలేరని రోజా విమర్శించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు వేసే చిటికెలకు ఎవరూ భయపడరని రోజా అన్నారు.

Next Story