పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.. తొలి సంత‌కం దేనిపై చేశారంటే

MLA RK Roja takes charge as Tourism Minister of Andhra Pradesh.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ఆర్కే రోజా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 April 2022 3:00 PM IST
పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా.. తొలి సంత‌కం దేనిపై చేశారంటే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. బుధ‌వారం స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన‌ అనంత‌రం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణి, కూతురు అన్షుమాలిక, కుమారుడు, వైసీపీ నేత‌లు పాల్గొన్నారు.

మంత్రిగా రోజా బాధ్య‌త‌లు స్వీక‌రించేముందు ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణి గుమ్మ‌డికాయ‌తో దిష్టి తీశారు. మంత్రి చాంబర్‌లోని చైర్‌లో కూర్చున్న అనంత‌రం ఆమెకు కూతురు ముద్దు పెట్టారు. బాధ్య‌త‌లు చేపట్టిన అనంత‌రం మంత్రి రోజా మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్‌ త‌న‌పై ఉంచిన న‌మ్మకాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌మ్ము చేయ‌న‌ని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వ‌న‌రుల‌ను ఉప‌యోగించి అభివృద్ధికి కృషి చేస్తాన‌ని చెప్పారు.

ఇక‌ వైసీపీ పార్టీని స్థాపించ‌క ముందే తాను జ‌గ‌న్ అడుగుజాడ‌ల్లో న‌డిచాన‌ని చెప్పారు. మంత్రులుగా ఉన్న వాళ్లంతా జ‌గన్‌కు సైనికుల్లా ప‌ని చేశార‌న్నారు. జ‌గ‌న్ లాంటి గొప్ప నేత‌తో క‌లిసి న‌డ‌వ‌డం త‌న అదృష్టంగా బావిస్తున్నాన‌ని చెప్పారు. గండికోట నుంచి బెంగళూరుకు టూరు కోసం మొదటి బస్సు విష‌యంపై తొలి సంతకం చేసినట్టు చెప్పారు. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క ముందు సీఎం జ‌గ‌న్‌ను రోజా క‌లిశారు.

రాజకీయ నేపథ్యం.. 2004లో నగరి నియోజకవర్గం, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్య‌త‌లు నిర్వర్తించారు.

Next Story